Friday, September 9, 2011

హైకూ

నడివీధిలో, కురులు విప్పి
 నిలబడిన వృద్ధ మహిళ -
ఊడల మర్రి !



 

Sunday, September 4, 2011

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..


తల్లి తండ్రి తరువాత  మరల అంతటి వారు,
మన వెలుగు చూసి వెలుగు వారి వదనము,
మన అఙ్ఞానమును దండించి,  ఙ్ఞానబోధ చేయ
అవతరించెను వారు, శారదా సుతులు..

మన తప్పులనొప్పుగా చేసి,
బలములను గొప్పగా చూపి,
వెన్నుతట్టి, వెంటనుండి,
ముందుకు నడిపించే ఙ్ఞాన మూర్తులు,

విలువైన విద్యనిచ్చి,
విద్యతో విలువలనిచ్చి,
నిత్యం మన విజయాన్ని కాంక్షించే,
విశాల  హృదయులు వారు,

ప్రపంచాన్ని పరిచయం చేసి,
మన పురోగతికి బాటలు పరచి,
మనని ముందుకు నడిపి,
తాము మాత్రం అక్కడే నిలిచిపోతారు --
భావి తరాలకు స్వాగతం చెబుతూ..
విఙ్ఞాన విశ్వపు గవాక్షాలు,
మన ఉపాధ్యాయులు!

కవితాంజలిదే,
ఆ ఇహ లోక దైవములకు,
ఉపాధ్యాయ దినోత్సవాన
నా చిరు  కానుకగా!

Monday, August 29, 2011

అమ్మా, నేను వదులుకోలేను!

వెలుగులు చిమ్మే నీ చిరునవ్వులని,
ఆ వెంటాడే చిరునవ్వులని
మరపించే చోటెక్కడుందో
నీకు తెలుసా? 

ఈ బాధ ని,
నీవు చేసిన ఈ గాయన్ని,
మరచిపోతూ జీవితాన్ని సాగించడం
ఎంత కష్టమో నీకు తెలుసా?

నీతో గడపని క్షణాలు, వృధా ప్రమాణాలు,
దాచుకున్న ప్రేమలు, తలుచుకున్నప్పుడల్లా
పశ్చాత్తాప భారంతో హృదయం బరువెక్కుతుంది.
నీవు పంచిన ప్రేమలకి,
నీవు నింపిన చిరునవ్వులకి,
నీవు మాత్రమే భరించిన బాధలకి,
నా జీవితం ఒక అంకిత గీతం.

నాలో నేనే రోదిస్తున్నాను,
ఈ హృదయాంతర సంఘర్షణలో
ముక్కలైపోతున్నాను,
ఇవేమీ అర్థంకానంతగా
నా మతి భ్రమిస్తే బాగుణ్ణు..
నా ఆశల శిధిలాల మధ్య నించి,
కన్నీటి పొరలలోంచి,
శూన్యంలోకి చూస్తుంటే
నువ్వే కనిపిస్తావు,
ఇంత బాధలోనూ ధైర్యాన్ని ఒలకబోస్తూ
నీ పెదవులనధిష్టించిన చిరునవ్వుని చూస్తే
భయమేస్తుంది..
మమ్మల్ని కంటిపాపల్లా కాచే
ఆ దైవం ఎక్కడ దూరమౌతుందో అని..

పసిపాప గా నన్ను ఎత్తుకున్న చేతులను,
నీ అనంతమైన ప్రేమని,
నీ ఒడి గుడిలో మాకు పంచిన అనురాగామృతాన్ని,
మా అభివృధ్ధి ని కాంక్షించే నీ దీవెనల్ని,
అమ్మా, నేను వదులుకోలేను..

Saturday, May 14, 2011

చోరుడు!!

నీలాన నెలవంక నిలిచున్న నిశిలోన,
నిదురోవు నెచ్చెలి నెరజాణ నుదుటన,
ముసిరేటి ముంగురులను ముద్దుగా మరల్చి,
మురిపాల ముద్దొకటి మత్తుగా ముద్రించి,
చప్పుడు చేయక చిక్కక, చక్కగా
చిక్కని చీకట్లలోకి చేరాడు చల్లగా!!

Friday, November 5, 2010

నీ విరహంలో..

నువ్వుండగా పరుగులు తీసే కాలం, నువ్వెళ్ళాక ఆగిపోతుందేం?
నువ్వుండగా ఊసులాడే మౌనం, నువ్వెళ్ళాక మూగబోతుందేం?
ఎందుకు నీ తోడు లేని అడుగులు, అలిసిపోతున్నాయి?
ఎందుకు నా దరహాసాలు, నీవు లేవని కన్నీళ్ళౌతున్నాయి?
నీ జత లేని వెన్నెలలెందుకు వేడినిస్తున్నాయి?
ఎందుకీ కలవరింతలూ, కలత నిదురలూ?
ప్రియా, ఎన్నాళ్ళీ కలహవిరహాలు?

Monday, October 25, 2010

ప్రేమ ..

అడుగుల దూరం లో నువ్వుంటే,
తడబడు మాటల మాటున ప్రేమ
ఆ దూరం పెరిగిపోతుంటే,
జారే కన్నీటి జడి ప్రేమ
నీ నవ్వు నన్ను తాకి వెళుతుంటే,
పెరిగే యద సడి చాటున ప్రేమ
నీ పెదవుల కదలిక లో నా పేరు వినపడితే,
మురిసే మౌన తరంగం ప్రేమ
నీవే నా ఎదుట నిలబడితే,
ఆకాశమంటుతూ ఎగిరే ఆనంద విహంగం నా ప్రేమ!

Monday, October 18, 2010

నా ప్రయాణం!

నా చుట్టూ పరుచుకున్న నిశీథిలోకి..
ఏకాంతం లోకి, అనంతంలోకి,
నా కలలు తీసుకెళ్ళే దూరాల్లోకి,
రెక్కలు తొడిగిన ఊహల విహారాల్లోకి,
పడుతూ, లేస్తూ, పరిగెడుతూ,
ఆగుతూ, అలసిపోతూ,
నేను ప్రయాణిస్తున్నాను నాలోకి!!