వెలుగులు చిమ్మే నీ చిరునవ్వులని,
ఆ వెంటాడే చిరునవ్వులని
మరపించే చోటెక్కడుందో
నీకు తెలుసా?
ఈ బాధ ని,
నీవు చేసిన ఈ గాయన్ని,
మరచిపోతూ జీవితాన్ని సాగించడం
ఎంత కష్టమో నీకు తెలుసా?
నీతో గడపని క్షణాలు, వృధా ప్రమాణాలు,
దాచుకున్న ప్రేమలు, తలుచుకున్నప్పుడల్లా
పశ్చాత్తాప భారంతో హృదయం బరువెక్కుతుంది.
నీవు పంచిన ప్రేమలకి,
నీవు నింపిన చిరునవ్వులకి,
నీవు మాత్రమే భరించిన బాధలకి,
నా జీవితం ఒక అంకిత గీతం.
నాలో నేనే రోదిస్తున్నాను,
ఈ హృదయాంతర సంఘర్షణలో
ముక్కలైపోతున్నాను,
ఇవేమీ అర్థంకానంతగా
నా మతి భ్రమిస్తే బాగుణ్ణు..
నా ఆశల శిధిలాల మధ్య నించి,
కన్నీటి పొరలలోంచి,
శూన్యంలోకి చూస్తుంటే
నువ్వే కనిపిస్తావు,
ఇంత బాధలోనూ ధైర్యాన్ని ఒలకబోస్తూ
నీ పెదవులనధిష్టించిన చిరునవ్వుని చూస్తే
భయమేస్తుంది..
మమ్మల్ని కంటిపాపల్లా కాచే
ఆ దైవం ఎక్కడ దూరమౌతుందో అని..
పసిపాప గా నన్ను ఎత్తుకున్న చేతులను,
నీ అనంతమైన ప్రేమని,
నీ ఒడి గుడిలో మాకు పంచిన అనురాగామృతాన్ని,
మా అభివృధ్ధి ని కాంక్షించే నీ దీవెనల్ని,
అమ్మా, నేను వదులుకోలేను..